Archive for October, 2008

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు

October 31, 2008

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు,
అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి యన్నట్లు.

కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని;
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు;
తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు;
అలరి పొగడుదురు కాపాలికులు అదిభైరవు డనుచు.

సరి నెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు;
దరిశనములు మిము నానావిధులను తలపుల కొలదుల భజింతురు;
సిరుల మిమ్మనే అల్పబుద్ది దలచినవారికి అల్పం బవుదువు;
గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు.

నీవలన కొరతే లేదు మరి నీరుకొలది తామెరవు,
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు;
శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని
ఈవల నే నీ శరణనియెదను ఇదియే పరతత్త్వము నాకు.

— శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య

బ్రహ్మ కడిగిన పాదము

October 30, 2008

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము

చెలగి వసుధ కొలిచిన పాదము
బలి తల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము

కామిని పాపము కడిగిన పాదము
పాము తల నిడిన పాదము
ప్రేమతో శ్రీసతి పిసికేటి పాదము
పామిడి తురగపు పాదము

పరమ యోగులకు పరి పరి విధముల
వర మొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమపదము నీ పాదము

— శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు

బలి వృత్తాంతం – పోతన భాగవతం నుంచి

October 29, 2008

బలి సంభోరుహ నేత్రుఁ డేమిటికినై పాద త్రయిన్ వేఁడె ని
శ్చలుఁడుం బూర్ణుఁడు లబ్ధ కాముఁడు రమాసంపన్నుఁ డై తాఁ బర
స్థలికిన్ దీనుని మాడ్కి నేల చనియెం దప్పేమియున్ లేక ని
ష్కలుషున్ బంధన మేల చేసెను వినం గౌతూహలం బయ్యెడిన్. ౮ – ౪౩౭

బలుదానంబుల విప్రులన్ దనిపి తద్భద్రొక్తులం బొంది పె
ద్దలకున్ మ్రొక్కి విశిష్ట దేవతల నంతర్భక్తిఁ బూజించి ని
ర్మలుఁ బ్రహ్లాదుని జీరి నమ్రశిరుఁడై రాజద్రధారూఢుఁడై
వెలిగెన్ దానవ భర్త శైలశిఖరోద్వేల్లద్దవాగ్నిప్రభన్ ౮-౪౪౨

అదితి కాశ్యప ప్రజాపతి తో
బలి జగముల నెల్ల బలియుచు నున్నాఁడు, వాని గెలువ రాదు వాసవునకు
యాగ భాగ మెల్ల నతఁ డా హరించుచుఁ గడగి సురల కొక్క కడియు నీడు ౮-౪౭౧
అప్పుడు కాశ్యప ప్రజాపతి
జనకుండెవ్వడు జాతుఁ డెవ్వడు జనిస్తానంబు లెచ్చోటు సం
జననం బెయ్యది మేను లేకొలది సంసారంబు లేరూపముల్
వినుమా యింతయు విష్ణుమాయ దలఁపన్ వేఱేమియున్ లేదు మో
హనిబంధంబు నిదాన మింతటికి జాయా విన్నఁబో నేటికిన్. ౮-౪౭౫

అప్పుడు కశ్యప ప్రజాపతి దితికి వ్రతము ఉపదేశించెను. దితి గర్భమున వామనమూర్తి అవిర్భవించెను
వెడ వెడ నడకలు నడచుచు నెడ నెడ నడుగిడగ నడరి ఇల దిగబడగా
బుడి బుడి నోడవులు నొడవుచు జిడి ముడి తడబడగ వడుగు చేరన్ రాజున్ – ౫౪౧

ఇట్లు డగ్గరి మాయ భిక్షకుండు రక్షోవల్లభున్ జూచి దీవించెను
అప్పుడు బలి
వడుగా ఎవ్వరివాఁడ వెవ్వఁడవు సంవాస స్థలం బెయ్య ది
య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫల మయ్యెన్ వంశమున్ జన్మముం
గడు ధన్యాత్ముడ నైతి నీమఖము యోగ్యం బయ్యె నా కోరికల్
గడతేరెన్ సుహుతంబులయ్యె శిఖిలుం గల్యాణ మిక్కాలమున్ ౮-౫౪౯
అప్పుడు వామన మూర్తి :
నొరులు గారు నాకు నొరులకు నే నౌదు, నొంటివాడఁ జుట్ట మొకడు లేడు
సిరియు దొల్లి గలదు చెప్పెద నాటెంకి, సుజనులందు దఱచు సోచ్చియుందు ౮-౫౫౨

ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర యొల్ల
గోర్కి దీర బ్రహ్మ కూకటి ముట్టెద దాన కుతుకసాంద్ర దానవేంద్ర. ౮-౫౬౬

అప్పుడు బలి
అడుగఁ దలచి కొంచె మడిగితి వోచెల్ల దాత పెంపు సొంపు దలఁపవలదె?

అప్పుడు వామన మూర్తి
వ్యాప్తిం బొందక వగవక ప్రాప్తం బగు లేశమైన పదివేలనుచుం
దృప్తిం జెందని మనుజుడు సప్త ద్వీపముల నయినఁ జక్కంబడునే? ౮-౫౭౪

ఇట్లు పలుకుచున్న ఖర్వునకు నుర్వీదానంబు సేయం దలంచి కరలకలిత సలిల కలశుండైన యవ్వితరణ ముఖరునిం గని నిజ విచార యుక్త దనుజ రాజ్య చక్రుండగు శుక్రుం డిట్లనియె:
ఇతడు ధరణి సుతుడు గాదు. విష్ణుముర్తియే! ఈ దానము దైత్య సంతతికి ఉపద్రవము తెచ్చును.
సర్వ మయిన చోట సర్వ ధనంబులు, నడుగ లేదటంచు ననృత మాడు
చెవఁటిపంద నేమి సెప్పఁ బ్రాణము తోడి, శవము వాడు వాని జన్మ మేల? ౮-౫౮౩
మఱియు ఇందొక్క విశేషంబు గలదు వివరించెద – ౫౮౪
వారిజాక్షులందు వైవాహికములందు బ్రాణవిత్తమానభంగమందు
జకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు బొంక వచ్చు నఘము బొంద డధిప – ౫౮౫

బలి చక్రవర్తి:
కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే
వా రేరీ? సిరి మూట గట్టికొని పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా. – ౫౯౦

బ్రతుక వచ్చు గాక బహు బంధనములైన వచ్చుఁగాక లేమి వచ్చుఁ గాక
జీవధనము లైన జెడుఁ గాక పడుఁ గాక, మాట దిరుగలేరు మాన ధనులు – ౫౯౮

వామన మూర్తి విశ్వరూపం:
ఇంతింతై వటు దింత యై మఱియు దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ౮-౬౨౨

ఆ విధం గా విజృంభించి బలి ని పాతాళానికి తొక్కగా, బ్రహ్మ దేవుడు అడుగుచున్నాడు:
భక్తి యుక్తుడు లోకేశ పదమునందు, నీవు ప్రత్యక్షముగ వచ్చి నేఁడు వేఁడ
నెఱిఁగి తన రాజ్యమంతయు నిచ్చినట్టి బలికి దగునయ్య ధృఢ పాశ బంధనంబు?
అని పలికిన బ్రహ్మ వచనంబులు విని భగవంతుండిట్లనియె ౮-౬౬౦

ఎవ్వనిఁ గరుణింప నిచ్ఛించితిని వాని యఖిల విత్తంబు నే నపహరింతు
సంసార గురుమద స్తబ్ధుడై యెవ్వఁడు దెగడి లోకము నన్ను ధిక్కరించు
నతఁ డెల్ల కాలంబు నఖిల యోనుల యందుఁ బుట్టును దుర్గతి బొందుఁ బిదప
విత్తవయోరూపవిద్యాబలైశ్వర్యకర్మజన్మంబుల గర్వ మడగి
యేక విధమున విమలుడై ఎవ్వడుండు, వాడు నాకూర్చి రక్షింపవలయు వాడు
స్తంభలోభాభిమాన సంసార విభవ, మత్తుడై చెడ నొల్లడు మత్పరుండు ౮-౬౬౧

హరిః ఓం తత్ సత్

— బలి పాడ్యమి సందర్భంగా

బేహారి – trader

October 28, 2008

వాడల వాడల వెంట వాడెవో,
నీడ నుండి చీర లమ్మే నేత బేహారి.

పంచ భూతములనెడి పలు వన్నె నూలు
చంచలపు గంజి తోడ చరి నేసి,
కొంచపు కండెల నూలి గుణముల నేసి,
మంచి మంచి చీర లమ్మే మారు బేహారి.

మటుమాయముల దన మగువ పసిడి నీరు
చిటిపోటి యలుకల చిలికించగా,
కుటిలంపు చేతలు కుచ్చులుగా గట్టి
పటవాళి చీర లమ్మే బలు బేహారి.

మచ్చిక జీవుల పెద్ద మైల సంతల లోన
వెచ్చపు కర్మ ధనము విలువ చేసి,
పచ్చడాలుగా కుట్టి బలువెంకటపతి
ఇచ్చ కొలదుల అమ్మే ఇంటి బేహారి.

— శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు

అన్నమాచార్యుల కాలం లో ‘చీర’ అనే మాటకు “వస్త్రం” అని అర్ధం. స్త్రీ, పురుషులు ఇరువురు ధరించే వస్త్రాన్ని చీర అని పిలిచే వారు.

అనుదినము దుఃఖ మేల?

October 27, 2008

మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినము దుఃఖ మందనేల?

చుట్టేడు కడుపుకై చొరని చోట్లు చొచ్చి,
పట్టెడు కూటికై బ్రతిమాలి,
పుట్టిన చోటికే పొరలి మనసు వెట్టి
వట్టి లంపటము వదల నేరడు గాన

అందరిలో పుట్టి అందరిలో చేరి,
అందరి రూపము లటు తానై,
అందమైన శ్రీ వెంకటాద్రీశు సేవించి,
అందరాని పద మందె నటు గాన.

— శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు

నానాటి బ్రతుకు నాటకము

October 27, 2008

నానాటి బ్రతుకు నాటకము
కానక కన్నది కైవల్యము

పుట్టుటయు నిజము, పోవుటయు నిజము,
నట్ట నడిమి పని నాటకము
ఎట్ట నెదుట గలదీ ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము

కుడిచే దన్నము, కోక చుట్టెడిది,
నడమంత్రపు పని నాటకము;
ఒడి గట్టుకొనిన ఉభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము

తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
ఎగువనె శ్రీ వేంకటేశ్వరు డేలిక,
గగనము మీదిది కైవల్యము

— శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు

ఉప్పుబొమ్మ

October 26, 2008

ఉప్పుబొమ్మ ఒకటి ఒకనాడు సముద్రపు లోతు తరచి చూచుటకై అందులో దిగెను. కాని దిగుట తడవుగా అది నీటిలో కరిగి మాయమయ్యెను. అట్లే జీవుడు బ్రహ్మ మహాత్త్వమును గ్రహింపబోయి తానూ భిన్నమను భావమునే కోల్పోయి బ్రహ్మము లో లయము చెందును.

— శ్రీ రామకృష్ణ పరమహంస

భగవంతుడు – నామములు

October 26, 2008

భగవంతునికి అనేక నామములు ఉన్నవి ఆయన రూపములును అనంతములుగా ఉన్నవి. నీకు ఏ నామము ఏ రూపము నచ్చునో వాని సాయము చేతనే భగవంతుని సాక్షాత్కారము పొందగలవు.

ఒకే నీరు వేర్వేరు జాతుల వారిచేత వేర్వేరు పేరులతో పెర్కొనబడుచున్నది. ఒక జాతి వారు ‘జల’ మందురు; ఇంకొక జాతి వారు ‘పాని’ అందురు; వేరొక జాతి వారు ‘వాటర్’ అందురు; మరొక జాతి వారు ‘ఆక్వా’ అందురు; అట్లే అఖండమగు సచ్చిదానందమయ పరబ్రహ్మమును కొందరు ‘దేవు’ డనియు, కొందరు ‘అల్లా’ అనియు, కొందరు ‘హరి’ అనియు, ‘బ్రహ్మ’ అనియు వ్యవహరింతురు.

— శ్రీ రామకృష్ణ పరమహంస

భగవంతుడు

October 26, 2008

రాత్రి కాలమున ఆకాశమునందు నక్షత్రములు అనేకములు కానిపించు చున్నవి.
సూర్యోదయము అయిన పిమ్మట అవి కాన వచ్చుట లేదు.
ఆ కారణముచే పగటి వేళ ఆకసమున చుక్కలు లేవనవచ్చునా?
అజ్ఞాన వశమున భగవంతుడు కానరాని కారణము చేత అతడు లేడనబోకుము.

— శ్రీ రామకృష్ణ పరమహంస

నేను

October 25, 2008

నేను
భూతాన్ని యజ్నోపవీతాన్ని
వైప్లవ గీతాన్ని నేను
స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం
అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం
లోకాలు భవభూతి శ్లోకాలు
పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు
నా ఊహ చాంపేయ మాల
రస రాజ్య డోల
నా ఊళ కేదార గౌళ

గిరులు సాగరులు కంకేళికా మంజరులు
ఝరులు నా సోదరులు
నేనొక దుర్గం నాదొక స్వర్గం
అనర్గళం అనితరసాధ్యం నా మార్గం
—- శ్రీ శ్రీ