విష్ణు తిధి…ఏకాదశి

తొలి ఏకాదశి… వైకుంఠ ఏకాదశి… ముక్కోటి ఏకాదశి… ఆ పేరులోనే ఏదో పవిత్రత! అంతెందుకు, ఏకాదశి రోజును హరిదినం, వైకుంఠదినంగా కీర్తించాయి ధర్మసింధు వంటి గ్రంథాలు.

హిందూ సంప్రదాయంలో పరమపవిత్రమైన తిథి ఏకాదశి. ఎంత పవిత్రమైనదంటే… ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులకూ ఏదో ఒక విశిష్టతను ఆపాదించి హరినామస్మరణ చేస్తారు భక్తులు. ఒక్కోరోజుకూ ఒక్కో ప్రాధాన్యత. వాటిలో ముఖ్యమైనది ఆషాడమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి. దీన్నే ‘తొలిఏకాదశి’ అంటారు. పూర్వం ఆషాడశుద్ధ ఏకాదశినే సంవత్సరారంభంగా భావించేవారు కాబట్టి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. శ్రీమహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పంపై శయనించే రోజు కాబట్టి ఈ రోజును శయనైకాదశి అని కూడా అంటారని పురాణాలు చెబుతున్నాయి. ఖగోళపరంగా చూస్తే ఈరోజుదాకా ఉత్తరదిశగా వాలి కనిపించే సూర్యుడు ఒకింత దక్షిణ దిశగా వాలినట్లు కనిపిస్తాడు. సూర్యుడంటే ప్రత్యక్షనారాయణుడు. అందువల్ల కూడా మన పూర్వులు ఈరోజును శయనైకాదశిగా వ్యవహరించి ఉండొచ్చని పండితుల అభిప్రాయం.

ఈరోజున ఏకాదశి వ్రతం చేసి విష్ణువును పూజించడం ఆచారంగా పాటిస్తారు భక్తులు. చాలా ప్రాంతాల్లో తొలిఏకాదశి నాడు ‘గోపద్మ వ్రతం’ చేస్తారు. అంటే గోవును పూజించడం అన్నమాట. ఈ నాలుగు నెలలూ వర్షాకాలం కాబట్టి పశువుల కొట్టాలను శుభ్రం చేసి వాటికి ఎలాంటి అనారోగ్యమూ రాకుండా కాపాడుకునే ప్రయత్నం ఇది. అలాగే ఈ నెల బహుళంలో వచ్చే ఏకాదశిని పాపనాశిని ఏకాదశి అంటారు. ఆరోజు విష్ణువును పూజించి ఏకాదశివ్రతం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని నమ్మిక.

శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి, లలితైకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే మంచిదని ప్రతీతి. ఇక బహుళంలో వచ్చేది కామిక ఏకాదశి. ఈరోజున వెన్న దానం చేయాలంటారు. భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈరోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశిఘడియల్లో హరిని పూజిస్తే కరవుకాటకాలు తొలగిపోతాయని పద్మపురాణంలో ఉంది. విశ్వామిత్రుడికి మాటిచ్చి రాజ్యాన్నీ భార్యాబిడ్డలనూ కోల్పోయిన హరిశ్చంద్రుడు భాద్రపద బహుళ ఏకాదశి(దీన్నే అజ ఏకాదశి అంటారు)నాడు వ్రతం ఆచరించి అన్నిటినీ పొందగలిగాడని పురాణప్రవచనం.

ముక్కోటి ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి బహుళంలోది ఉత్పత్తి ఏకాదశి. విష్ణుమూర్తి శరీరం నుంచి పుట్టిన కన్య మురాసురుని సంహరించిన దినం ఇది. తొలిఏకాదశినాడు శయనించిన విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి మేలుకునే రోజు కాబట్టి ఈ రోజును ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు భక్తులు. మార్గశిర శుద్ధంలో వచ్చేది మోక్షొకాదశి, సౌఖ్యదా ఏకాదశి. అప్పటికి ధనుర్మాసం కూడా వచ్చి ఉంటే ఆరోజును ‘ముక్కోటి/వైకుంఠ ఏకాదశి’ అంటారు. చాంద్రమానాన్ని బట్టీ ఇది ఒక్కోసారి మార్గశిరంలో మరోసారి పుష్యంలో వస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణ్వాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆరోజున స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్న వారికి మోక్షం లభిస్తుందని ప్రతీతి. అలాగే, అర్జునుడికి శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో విశ్వరూపం చూపి గీతాబోధన చేసింది ఈరోజేనని పురాణాలు చెబుతున్నాయి. ఇక మార్గశిర బహుళంలో వచ్చేది విమలైకాదశి. దీన్నే సఫలైకాదశి అని కూడా అంటారు. పుష్యశుద్ధంలిో వచ్చేది నంద/పుత్ర ఏకాదశి. అదే మాసం బహుళంలో వచ్చేది కల్యాణైకాదశి.

భీష్మఏకాదశి
మాఘశుద్ధ ఏకాదశిని భీష్మఏకాదశిగా ఆచరిస్తారు భక్తులు. ఈరోజునే కామదైకాదశి, జయైకాదశి అని కూడా వ్యవహరిస్తారు. మరో పదిహేను రోజులకు వచ్చేది విజయైకాదశి. ఆరోజున పాదరక్షలు దానం చేయడం మంచిదంటారు. రాముడు సేతువు నిర్మాణాన్ని ప్రారంభించి విజయం పొందిన రోజు ఇదేనని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఫాల్గుణ మాసంలో ధాత్రైకాదశి, సౌమ్యైకాదశి వస్తాయి. చైత్రశుద్ధంలో వచ్చే ఏకాదశిని దమనైకాదశి అంటారు. దీనికే అవైధవ్య ఏకాదశి అని కూడా పేరు. చైత్ర బహుళ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే వేయి ఆవులను దానం చేసిన పుణ్యం లభిస్తుందంటారు. ఈ రోజును వరూధిన్యైకాదశి అంటారు. వైశాఖ మాసంలో మొదట వచ్చే మోహిన్యేకాదశి నాడు చెప్పులు, పాలు, చల్లటినీరు… బహుళంలో వచ్చే సిద్ధైకాదశినాడు గొడుగు… దానం చేస్తే మంచిదంటారు. ఇవన్నీ సూర్యప్రతాపం నుంచి రక్షణ కల్పించేవే. జ్యేష్ఠంలోనూ అంతే. మొదటిది త్రివిక్రమైకాదశి. నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు కాబట్టి దీన్నే నిర్జలైకాదశి అంటారు. ఆరోజు నీళ్లకుండలు, నెయ్యి, గొడుగు వంటివి దానం చేస్తారు. ఇక ఆఖరిది జ్యేష్ఠ బహుళ ఏకాదశి… దీన్నే యోగిన్యైకాదశి అంటారు.

ఏకాదశి కథ
విష్ణువు మురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి సింహవతి అనే గుహలో దాక్కున్నాడట. అప్పుడాయన శరీరం నుంచి ఒక అందమైన కన్య ఉద్భవించి మురుడితో యుద్ధం చేసి సంహరించిందట. ఆ కన్య పేరే ఏకాదశి. ఆమె ధైర్యసాహసాలకు సంతోషించిన విష్ణువు ఆమెను ఏంకావాలో కోరుకోమంటే తాను విష్ణువుకు ప్రియతిథిగా అందరిచేతా పూజలందుకోవాలని కోరుకుందట. తథాస్తు అన్నాడు నారాయణుడు. నాటి నుంచి జనులు ఏకాదశి తిథిని పరమపవిత్రమైనదిగా భావిస్తున్నారని భవిష్యోత్తరపురాణం చెబుతోంది.

— ఈనాడు ఆదివారం లో వచ్చింది

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: